కరోనావైరస్: 700 కోట్ల జనాభాకు వ్యాక్సిన్ వేయటం ఎలా?
కోవిడ్-19 సోకకుండా నిరోధించ గల వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయటానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధక బృందాలు కృషి చేస్తున్నాయి.
అయితే.. అటువంటి వ్యాక్సిన్‌ను తయారు చేసినా కానీ ప్రపంచంలోని 700 కోట్ల మంది జనాభాకు దానిని ఎలా అందిస్తారు? వారందరి దగ్గరకూ వ్యాక్సిన్‌ను తీసుకెళ్లటానికి అవసరమైన మౌలిక సదుపాయాల సంగతేమిటి?
ఈ దిశగా ఇప్పటికే బ్రిటన్‌లో పనులు మొదలయ్యాయి. ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లోని మాజీ వైమానిక దళ స్థావరం ఇందుకు కేంద్రంగా ఉంది. అది ఇప్పుడు హార్వెల్ సైన్స్ క్యాంపస్‌గా మారింది. దీనిని 'వ్యాక్సిన్స్ మాన్యుఫాక్చరింగ్ అండ్ ఇన్నొవేషన్ సెంటర్'గా మార్చబోతున్నారు.
''మొదట 2022 నాటికి దీనిని సిద్ధం చేయగలమని మేం భావించాం. ఇప్పుడు ఆ సమయాన్ని సగానికి తగ్గించాం. 2021 నాటికి ఇది పని మొదలుపెడుతుందని ఆశిస్తున్నాం'' అని వీఎంఐసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మాథ్యూ డుచార్స్ చెప్పారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కోవిడ్ వ్యాక్సిన్‌ను ఇక్కడే ఉత్పత్తి చేసే అవకాశముంది. ఇక్కడికి కాస్త దిగువన ఉన్న జెన్నర్ ఇన్‌స్టిట్యూట్‌లోని శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్నారు.
''ఈ తరహా వ్యాక్సిన్‌లను వేగంగా సమర్థవంతంగా ఉత్పత్తి చేయగలగటం ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా చాలా కీలకమైన విషయం. ఇది భారీ బాధ్యత'' అంటారాయన.
''ఒక రకంగా చెప్తే ఇంట్లో కేకు తయారు చేయటం వంటిది. మొదట గంటల తరబడి సమయం వెచ్చించి ఒక ఖచ్చితమైన కేక్‌ను తయారు చేయాలి. ఆ తర్వాత బయటకు వెళ్లి సరిగ్గా అటువంటి కేకులు 700 కోట్లు తయారు చేయాలి. ఇది పెద్ద సవాలే'' అని ఆయన పోల్చారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి.. తను తయారు చేయబోయే వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయటానికి ఇప్పటికే తగినంత సురక్షితమైన తాత్కాలిక లేబరేటరీ ఉంది.
మానవాళి పలు రకాల కోవిడ్-19 వ్యాక్సిన్‌లు కోట్ల డోసులను తయారు చేయాల్సి ఉంటుంది. అలా తయారుచేసిన వాటిని ప్రపంచమంతా పంపిణీ చేసి, ప్రజలకు ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది.
వ్యాక్సిన్ల పంపిణీ గురించి ఆలోచించాలని ప్రపంచ దేశాలకు అంతర్జాతీయ వ్యాక్సిన్ల కూటమి 'గవి' విజ్ఞప్తి చేస్తోంది.
కానీ అంతర్జాతీయ సహకారం పొందటం అంత సులభం కాదు. ఎందుకంటే సంపన్న దేశాలు ఇప్పటికే ఔషధ సంస్థలతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అద్భుత ఔషధాన్ని తయారు చేస్తే ముందుగా తమకు సరఫరాలు ఉండేలా మాట్లాడుకుంటున్నాయి.
స్వీయ ప్రయోజనాలను అధిగమించటం
తాము ఎదుర్కొంటున్న అతి పెద్ద అవరోధాల్లో 'వ్యాక్సిన్ జాతీయతావాదం' అనేది ఒకటని 'గవి' సీఈఓ సేత్ బర్కిలీ అంటున్నారు.
''అన్ని దేశాలూ అంతర్జాతీయ దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అలా చేయటం సరైన పని. అంతేకాదు.. అలా చేయటం స్వీయ ప్రయోజనం కూడా'' అని ఆయన పేర్కొన్నారు.
''చుట్టుపక్కల దేశాల్లో పెద్ద మొత్తంలో వైరస్ వ్యాపిస్తున్నట్లయితే.. వాణిజ్యం కానీ, ప్రయాణం కానీ, ప్రజల రాకపోకలు కానీ తిరిగి మామూలుగా సాగించటం సాధ్యం కాదు. 'అందరూ క్షేమంగా లేనిదే మనమూ క్షేమంగా ఉండలేం' అనే దృక్పథం ఉండటం చాలా ముఖ్యం'' అని ఆయన వివరించారు.
సేత్ బర్కిలీ 'గవి' సీఈఓగా.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సరైన వ్యాక్సిన్లు అందేలా చూడటంతో పాటు.. ఆ వ్యాక్సిన్లు పంపిణీ చేయటంలో మరింత కీలకమైన కోణాల గురించి అన్వేషించాల్సి ఉంటుంది.
ప్రపంచంలో తగినన్ని వయల్స్ అందుబాటులో ఉన్నాయా? అనేది అందులో ఒకటి. మెడికల్ గ్లాస్ (వైద్య సంబంధిత గాజు) ఉత్పత్తికి అవరోధాలు తలెత్తవచ్చునని నివేదికలు వస్తున్నాయి.
''ఈ విషయం ఆందోళన కలిగించింది. దీంతో మేం 200 కోట్ల డోసులకు సరిపడా వయల్స్ కొనుగోలు చేశాం. 2021 నాటికి అన్ని డోసుల వ్యాక్సిన్ సిద్ధం చేయాలని మేం భావిస్తున్నాం'' అని ఆయన తెలిపారు.
గ్లాస్ వయల్స్ ఒక సమస్య అయితే.. ఫ్రిడ్జ్‌ల విషయం మరో సమస్య. ఎందుకంటే చాలా వ్యాక్సిన్లను తక్కువ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయాల్సి ఉంటుంది.
చల్లగా ఉంచాలి...
బర్మింగామ్ యూనివర్సిటీలో కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాల నిపుణుడు ప్రొఫెసర్ టోబీ పీటర్స్.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రస్తుతమున్న రిఫ్రిజిరేషన్ సామర్థ్యాన్ని గరిష్టంగా పెంచటం ఎలా అనే అంశంపై 'గవి' వంటి సంస్థలకు సాయం చేస్తున్నారు.
''వ్యాక్సిన్ ఫ్రిడ్జ్ మాత్రమే కాదు.. వ్యాక్సిన్లను విమానాల్లో, వాహనాల్లో తరలించటానికి అవసరమైన ప్యాలెట్లు.. స్థానిక స్టోర్లకు తరలించే వాహనాలూ.. ప్రజా సమూహాల దగ్గరకు తీసుకెళ్లే మోటారుసైకిళ్లు, మనుషులు.. అన్నీ అందరూ సజావుగా పనిచేయాల్సి ఉంటుంది'' అని ఆయన పేర్కొన్నారు.
ఈ భారీ ప్రాజెక్టు కోసం కోల్డ్ చెయిన్ స్టోరేజీలను అద్దెకు తీసుకునే అవకాశాలను పరిశీలించటానికి అంతర్జాతీయంగా ఆహార, పానీయ సంస్థలతో ప్రొఫెసర్ పీటర్స్ చర్చిస్తున్నారు.
వ్యాక్సిన్లను మరింత సమర్థవంతంగా పంపిణీ చేయాలంటే.. దేశాలు తమ జనాభాలో ముందుగా ఎవరికి వాటిని అందించాలనే వ్యూహం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.
వరుసలో ముందు ఉండేది ఎవరు?
దేశాలు నిర్మొహమాటంగా కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది అని బ్రిటన్‌లోని వెల్‌కమ్ ట్రస్ట్ సంస్థ వ్యాక్సిన్ల విభాగం అధిపతి డాక్టర్ చార్లీ వెల్లర్ చెప్తున్నారు.
''ఈ వ్యాక్సిన్ ఎవరికి అవసరం? అత్యధిక ముప్పు ఉన్న బృందాలు ఏవి? అత్యధిక ప్రాధాన్యం ఉన్నవాళ్లు ఎవరు? ఎందుకంటే.. తొలి వ్యాక్సిన్ ఏదైనా సరే ఉత్పత్తి పంపిణీ చాలా పరిమితంగా ఉంటుందనేది స్పష్టం. కాబట్టి ప్రాధాన్యతలను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది'' అని ఆయన వివరించారు.
ఇక క్షేత్రస్థాయిలో వ్యాక్సిన్లు వేయటం కూడా సమస్యాత్మకమే అవుతుంది.
ఉదాహరణకు బ్రిటన్.. తన ప్రజలకు వీటిని అందించటానికి తన పోలింగ్ స్టేషన్ల వ్యవస్థను ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలిస్తోంది. కానీ పేద దేశాలకు ఇది మరింత కష్టమైన పని అవుతుంది.
లక్ష్యంగా పెట్టుకున్న బృందాలకు వ్యాక్సిన్లు వేయటానికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు గల వైద్య సిబ్బంది ఉన్న బలమైన వైద్య సదుపాయాల వ్యవస్థ చాలా కీలకమని డాక్టర్ వెల్లర్ అంటారు.
ఏదో ఒక వ్యాక్సిన్‌ను కనిపెడతామని శాస్త్రవేత్తలు అందరూ భావిస్తున్నారు. కానీ.. అలా కనిపెట్టిన వ్యాక్సిన్‌ను వందల కోట్ల మంది ప్రజలకు అందించటమనే భారీ కసరత్తును ఎలా పూర్తిచేయటమనే ఆలోచన తమకు నిద్రపట్టనివ్వటం లేదని వారిలో చాలా మంది చెప్తున్నారు.
Comments
Post a Comment