‘జై హింద్ నినాద సృష్టికర్త ఓ హైదరాబాదీ ముస్లిం’.. ఆ నినాదం వెనుకున్న కథ ఇదీ..

అబిద్ హసన్ సాఫ్రాని (ఎడమ)
ఫొటో క్యాప్షన్,

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌తో అబిద్ హసన్ సాఫ్రాని (ఎడమ)

ఆగస్టు 15 వ తేదీ 1947. దిల్లీలోని ఎర్ర కోట నుంచి భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం తర్వాత ఇచ్చిన 'జై హింద్' నినాదం... దేశభక్తికి తార్కాణంగా చేసే నినాదంగా నేటికీ నిలిచిపోయింది.

అయితే, ఈ ‘జై హింద్' నినాదం సృష్టి కర్త ఎవరు? జై హింద్‌కి అప్పటి నిజాం పాలనలోని హైదరాబాద్‌‌కు ఉన్న సంబంధం ఏమిటి?

హైదరాబాద్‌కు చెందిన అబిద్ హసన్ సాఫ్రానిని 'జై హింద్' నినాదానికి సృష్టికర్తగా భావిస్తారు. ఈ విషయం గురించి హైదరాబాద్ చరిత్రకారుడు, మాజీ ఐఏఎస్ అధికారి నరేంద్ర లూథర్ తన 'లెజెండోట్స్ ఆఫ్ హైదరాబాద్' అనే పుస్తకంలో ప్రస్తావించారు.

ఈ విషయంపై మరింత సమాచారం తెలుసుకునేందుకు నరేంద్ర లూథర్‌ను... అబిద్ హసన్ దత్త పుత్రిక, అరబిక్ ప్రొఫెసర్ ఇస్మత్ మెహదీని బీబీసీ తెలుగు సంప్రదించింది.

నరేంద్ర లూథర్ ఈ మెయిల్ ద్వారా బీబీసీతో మాట్లాడారు. జై హింద్ నినాదం పుట్టిన వైనాన్ని ఇస్మత్ మెహదీ కూడా బీబీసీకి వివరించారు.

భారత జాతీయ గీతం ఆలపిస్తున్న చిన్నారులు

‘జైహింద్' ఎందుకు పుట్టింది?

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సుభాష్ చంద్ర బోస్ భారత దేశ స్వాతంత్య్ర సమరానికి మద్దతు కూడగట్టుకునేందుకు జర్మనీ వెళ్లారు. ఆ సమయంలో జర్మనీ బ్రిటన్‌తో యుద్ధం చేస్తోంది.

అదే సమయంలో అబిద్ కూడా తన ఇంజనీరింగ్ చదువు నిమిత్తం జర్మనీ వెళ్లారు. బోస్ తన స్వాతంత్య్ర పోరాటానికి మద్దతు కూడగట్టుకునేందుకు చేస్తున్న ప్రసంగాలతో అబిద్ హసన్ ప్రభావితమయ్యారు.

బోస్ ప్రసంగాలు విన్న అబిద్ తన చదువు పూర్తి కాగానే తాను స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వామినవుతానని చెప్పారు.

ఆ మాట విన్న బోస్.. "ఇలా చిన్న చిన్న విషయాల వెంటపడితే, జీవితంలో పెద్ద లక్ష్యాలను ఎప్పటికీ సాధించలేం'' అని స్పందించారు.

ఆ మాటలకు ప్రభావితమైన అబిద్ హసన్ తన ఇంజనీరింగ్ చదువుని మధ్యలోనే విడిచిపెట్టి, బోస్‌కి వ్యక్తిగత కార్యదర్శిగా, జర్మన్ భాష ఇంటర్ప్రెటర్‌ (అనువాదకుడి)గా చేరినట్లు నరేంద్ర లూథర్ వివరించారు.

బోస్ పునర్వ్యవస్థీకరించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో అబిద్ మేజర్‌గా పని చేశారు.

ఇండియన్ నేషనల్ ఆర్మీలో భిన్న వర్గాలకు చెందిన ప్రజలు ఉండే వారు. అందులో కొంత మంది 'నమస్కార్' అని సంబోధిస్తే, మరికొంత మంది 'రామ్ రామ్' అంటూ పలకరించేవారు. 'సత్ శ్రీ అకాల్', 'సలాం అలైకుం' అంటూ అభివాదం చేసుకునేవాళ్లు కూడా ఉండేవారు.

"సెక్యులర్ భావాలు కలిగిన బోస్‌కు ఇన్ని రకాల అభివాదాలు ఉండటం సబబుగా తోచలేదు. అందరికీ ఆమోద యోగ్యమైన ఓ పిలుపును తయారు చేయాలని బోస్ తన సన్నిహితులకు సూచించారు. అబిద్ ముందు 'హలో' ని సూచించగా, బోస్ ఒప్పుకోలేదు. తర్వాత 'జై హిందుస్తాన్' అని సూచించారు. అది మరీ పెద్దదైపోవడంతో దానిని కుదించి 'జై హింద్' అని మార్చారు. 'జై హింద్' నినాదం బోస్‌కు నచ్చింది. ఆయన దాన్ని ఆమోదించారు" అని ఇస్మత్ బీబీసీకి వివరించారు.

ఇదే విషయాన్ని నరేంద్ర లూథర్ ఆయన పుస్తకం లో కూడా ప్రస్తావించారు.

అప్పటి నుంచి 'జై హింద్' అనే పదం దేశ భక్తిని చాటుకునే ఒక నినాదంగా నిలిచిపోయింది.

అబిద్ హసన్ సాఫ్రాని

అబిద్ హసన్ ఎవరు?

1863 - 1883 మధ్య కాలంలో హైదరాబాద్ దివాన్ గా పని చేసిన సర్ సాలార్ జంగ్-1 హైదరాబాద్ పరిపాలనను ఆధునీకరించే ఉద్దేశంతో, భారతదేశంలోని పలు ప్రాంతాల నుంచి ఆంగ్ల విద్యను అభ్యసించిన అధికారులను హైదరాబాద్‌కు రప్పించారు.

అలా వచ్చిన వారిలో నవాబ్ మొహసిన్ ఉల్ ముల్క్ ఒకరు. ఆయన చిన్న తమ్ముడు అమీర్ హసన్ నిజాం సంస్థానంలో కలెక్టర్‌గా పని చేసేవారు.

అమీర్ హసన్‌ భార్య ఇరాన్‌కు చెందినవారు. వీళ్లద్దరికీ 1911లో అబిద్ హసన్ జన్మించారు.

అబిద్ హసన్ తల్లి బ్రిటీష్ పాలన పట్ల వ్యతిరేకతతో ఉండేవారని లూథర్ తెలిపారు. అందుకే ఉన్నత విద్య కోసం హసన్‌ను ఆమె జర్మనీ పంపి ఉండవచ్చని అన్నారు.

"ఇండియన్ నేషనల్ ఆర్మీ కూలిపోయిన తర్వాత అబిద్ హసన్ కొన్నేళ్ల పాటు సింగపూర్ జైలులో ఉన్నారు. అబిద్ కుటుంబ సభ్యులంతా ఆయన మరణించి ఉంటారని అనుకున్నారు. కానీ, ఆయన తల్లి మాత్రం తన కొడుకు ఎక్కడో ప్రాణాలతోనే ఉంటాడనే నమ్మకంతో ఉండేవారు" అని లూథర్ రాసిన పుస్తకంలో ఉంది.

ఐఎన్ఏ కేసు విచారణ ముగియగానే ఖైదీలందరినీ విడుదల చేశారు. జైలులో ఉండటంతో అబిద్ హసన్ ఆరోగ్యం క్షీణించింది.స

అబిద్ హసన్ 1946లో హైదరాబాద్‌కు తిరిగి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ, పార్టీలో ఆయన ఎక్కువ కాలం ఉండలేకపోయారు.

సుభాష్ చంద్ర బోస్ లాంటి నాయకులతో పని చేసిన తర్వాత రాజకీయ పార్టీలలో ఉండే అంతర్గత కక్షలు, మోసం, చూసి తట్టుకోలేక పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చేసినట్లు ఇస్మత్ చెప్పారు.

ఆ తర్వాత కరాచీలో బెంగాల్ లాంప్ అనే ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగంలో చేరారు.

అబిద్ హసన్ సాఫ్రాని

స్వాతంత్ర్యం వచ్చాక రాయబారిగా..

1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు అబిద్ తిరిగి హైదరాబాద్ వచ్చారు.

ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో విదేశాంగ శాఖలో వివిధ పదవులు నిర్వహించారు. ఆ పదవులు చేపట్టక ముందు ఆ ఉద్యోగానికి ఆయన ఎలా సిద్ధమయ్యారో ఇస్మత్ బీబీసీకి వివరించారు.

"విదేశాంగ శాఖలో ఖాళీలు ఉన్నాయని తెలిసి అబిద్ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. ఆయన ఇంటర్వ్యూకి సిద్ధం కావడానికి చాలా వార్తా పత్రికలు చదివారు. నేతాజీతో కలిసి పని చేసేటప్పుడు భారతదేశానికి స్వాతంత్య్రం వస్తే విదేశాంగ విధానం ఎలా ఉండాలో చాలా చర్చలు జరిగాయి. దీంతో దేశ విదేశాంగ విధానం పట్ల అబిద్ సమగ్ర ఆలోచన కలిగి ఉండేవారు" అని ఇస్మత్ చెప్పారు.

''ఆ ఇంటర్వ్యూ బోర్డులో విదేశాంగ శాఖ నిర్వహిస్తున్న జవహర్ లాల్ నెహ్రూ, గిరిజ శంకర్ బాజ్‌పాయ్ లాంటి ప్రముఖులు ఉన్నారు.

అబిద్‌కు పార్శి, జర్మన్ భాషలలో కూడా ప్రావీణ్యం ఉంది. ఇంటర్వ్యూ బోర్డు లో సభ్యులు తన బయో‌డేటా చూస్తుండగానే, సోదరుడు హాది హసన్ దగ్గర తాను చాలా విషయాలు నేర్చుకున్నట్లు అబిద్ వారికి చెప్పారు.

ఆ తర్వాత ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు ''ఇక మిమ్మల్ని ప్రశ్నలు అడిగాల్సిన అవసరం లేదు'' అని అన్నారట'' అని ఇస్మత్ చెప్పారు.

ఈ విషయం అబిద్ స్వయంగా తనకు చెప్పినట్లు ఆమె వివరించారు.

అబిద్ హసన్ సోదరుడు హాది హసన్ ప్రముఖ పర్షియన్ సాహిత్యవేత్త. ఆయన కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలాన్ని పర్షియన్ భాషలోకి అనువదించారు.

అబిద్ హసన్ వివాహం చేసుకోలేదు.

కానీ, ఆయన ముగ్గురు పిల్లలను పెంచుకున్నారు. అందులో ఇస్మత్ మెహది ఒకరు. ఆమె సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్‌లో అరబిక్ ప్రొఫెసర్‌గా పని చేశారు.

అబిద్ హసన్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని చెబుతూ.. " నాకు అప్పుడు 7-8 సంవత్సరాలు ఉంటాయి. నా పేరు మన్ని అని చెబుతూ ఆయనకు నేనొక ఉత్తరం రాశాను. దాన్ని ఆయన జీవితమంతా దాచుకున్నారు. అదే, మా బంధాన్ని తెలియజేస్తుంది. తనతోపాటు నన్ను ఆయన ఎన్నో దేశాలు తీసుకుని వెళ్లారు. ఆయన దగ్గరే నేను భాషలు నేర్చుకున్నాను. ఆయన చాలా క్రమశిక్షణతో వ్యవహరించేవారు" అని ఇస్మత్ గుర్తు చేసుకున్నారు.

1969లో అబిద్ పదవీ విరమణ చేశాక, తిరిగి హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. 1984లో ఆయన మరణించారు.

అబిద్ హసన్ సాఫ్రాని

అబిద్ పేరులో సాఫ్రాని ఎలా చేరిందంటే..

ఇండియన్ నేషనల్ ఆర్మీ జెండా ఎలా ఉండాలనే అంశం చర్చకు వచ్చినప్పుడు హిందువులు కాషాయ రంగు ఉండాలని, ముస్లింలు ఆకుపచ్చని రంగు ఉండాలని పట్టు పట్టారు.

ఆ సమయంలో ఎవరూ వెనక్కి తగ్గడానికి ఒప్పుకోలేదు. తీవ్ర వాదోపవాదాలు, చర్చల తర్వాత హిందువులు తమకు జెండాలో ఒక భాగం ఇస్తూ, మరో భాగం ముస్లింలకు, మూడవ భాగం మిగిలిన మతాల వారికి ప్రాతినిధ్యం వహించేలా ఉండటానికి అంగీకరించారు.

దీంతో మువ్వన్నెలతో కూడిన జెండా తయారైంది.

''హిందువుల త్యాగానికి గుర్తుగా అబిద్ తన పేరుకి సాఫ్రాని (కాషాయ రంగు) అని జత చేసుకున్నారు. అలా అది ఆయన ఇంటి పేరుగా స్థిరపడి పోయింది" అని ఇస్మత్ మెహది చెప్పారు.

సుభాష్ చంద్రబోస్‌తో చివరి క్షణాల వరకు గడిపిన వ్యక్తుల్లో అబిద్ ఒకరని ఇస్మత్ చెప్పారు.

"1945లో బోస్ రష్యాకి ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు మరో ముగ్గురు ప్రయాణించాల్సి ఉంది. అందులో అబిద్ ఒకరు. అయితే, ఆ విమాన పైలట్ ఇద్దరి కంటే ఎక్కువ మందిని తీసుకుని వెళ్ళలేను అని చెప్పడంతో నేతాజీ అబిద్‌ను రావద్దని చెప్పారు. లేదంటే, ఆ విమానంలో అబిద్ హసన్ కూడా ఉండేవారు" అని ఇస్మత్ వివరించారు.

జపాన్, జర్మనీ సబ్ మెరైన్‌లలో నేతాజీ సింగపూర్ ప్రయాణించినట్లు నరేంద్ర లూథర్ రాసిన పుస్తకంలో ఉంది.

ఆ సమయంలో ఇండియన్ నేషనల్ ఆర్మీకి సంబంధించిన బంగారంతో కూడిన ఒక పెట్టె అబిద్ దగ్గర ఉండిపోయిందని, ఆయన పరుగుపరుగున వెళ్లి దాన్ని బోస్‌కు అప్పగించారని ఇస్మత్ చెప్పారు.

"భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు... బోస్ ఆ బంగారాన్ని రష్యాలో వినియోగించే ఆలోచన ఉన్నట్లు అబిద్ చెప్పారు. ఆయన దగ్గర నేతాజీ సిగరెట్ పెట్టె కూడా ఉండిపోయింది. కానీ, అది మాత్రం తిరిగి ఇవ్వలేకపోయారు" అని ఇస్మత్ అన్నారు.

"సుభాష్ చంద్ర బోస్‌ను ఆఖరి సారి సజీవంగా చూసిన కొద్ది మంది వ్యక్తుల్లో అబిద్ హాసన్ ఒకరు. జై హింద్ అనే నినాదం కేవలం ఇండియన్ నేషనల్ ఆర్మీకి సంబంధించింది కాదు. ఇది దేశమంతటికీ సంబంధించిన నినాదం. ఇలాంటి వ్యక్తులను భావి తరాలు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది" అని హైదరాబాద్ చరిత్రకారుడు సజ్జాద్ షాహిద్ అన్నారు.

Comments

Popular posts from this blog

India power plant fire: Nine reported dead in major blaze in Telangana

కరోనావైరస్: 700 కోట్ల జనాభాకు వ్యాక్సిన్ వేయటం ఎలా?

Gandhi's glasses left in letterbox sell for £260k