జనరల్‌ బిపిన్ రావత్‌ చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్ అయ్యాక సైన్యంలో వచ్చిన మార్పులేంటి?

 

జనరల్ బిపిన్ రావత్

డిసెంబర్‌ 15, 2015న ఏం జరిగింది? ఆ రోజున ఏం జరిగిందో కొద్దిమందికి మాత్రమే తెలుసు. గూగుల్‌లో వెతికినా కూడా ఆ సమాచారం కనిపించలేదు కానీ, ఆ రోజుకున్న ప్రాధాన్యం ఇప్పటికీ చాలామందికి తెలియదు.

కేరళలోని కొచ్చికి పశ్చిమాన యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న అరేబియా మహాసముద్రంపై భారతీయ సైనిక బలగాలు అద్భుతమైన విన్యాసాలను ప్రదర్శిస్తున్నాయి. ఒకేసారి 60 యుద్ధ విమానాలు, 30 యుద్ధనౌకలు, ఐదు జలాంతర్గాములు ఇందులో పాల్గొన్నాయి.

వీటన్నింటి మధ్య, భారతదేశపు విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య నిలబడి ఉంది. మొదటి కంబైన్డ్‌ కమాండర్స్‌ కాన్ఫరెన్స్ (సీసీసీ)కు ఈ నౌక ఆతిథ్యమిస్తోంది. ఈ వార్షిక సమావేశంలో భారత రాజకీయ నాయకత్వంతోపాటు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, నేవీ విభాగాల అగ్ర నేతలు పాల్గొన్నారు.

తొలిసారి ఢిల్లీ వెలుపల జరుగుతున్న కంబైన్డ్‌ కమాండ్స్‌ కాన్ఫరెన్స్‌ ఇది. తనవంతు రాగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం ప్రారంభించారు.

"ఉమ్మడి (జాయింట్‌నెస్‌) అన్నది అత్యంత ప్రాధాన్యమైన అంశం. చాలా రోజుల నుంచి దానిపై చర్చ జరుగుతోంది. మిలటరీ నాయకత్వానికి మూడు దళాలకు సంబంధించి అనుభవం ఉండాలి. సీనియర్‌ అధికారుల స్థానాలను కూడా మెరుగుపరచాలి. రక్షణ రంగానికి సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు ఇప్పటికీ అమలు చేయకపోవడం విచారకరం'' అన్నారు ప్రధాని.

గత ఏడాది సరిగ్గా స్వాంతంత్ర్య దినోత్సవాన, మిలటరీలోని లోపాలకు సంబంధించి తాను పేర్కొన్న అంశాలను సరిదిద్దే ప్రక్రియను ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ను ప్రకటించడం ఇందులో భాగమే.

ప్రధానమంత్రి ప్రతిపాదనకు డిసెంబర్‌ 24, 2019న కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఆరు రోజులకు అప్పటి ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ను మొదటి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా నియమిస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.

అయితే, నియామకం చేపట్టగానే సరిపోదు. ఆ పదవిలో ఎవరిని కూర్చోబెట్టారు అన్నది ముఖ్యం కాదు. ఆయన చేయాల్సిన పనులు, నిర్వర్తించాల్సిన బాధ్యతలు, ఆయనకున్న అధికారాలు చాలా కీలకమైనవి.

“చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ నిర్వర్తించవలసిన బాధ్యతలను నోట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు’’ అని ఈ పదవి ఏర్పాటుపై రూపొందించిన నోట్‌పై సంతకంలో చేసి వారిలో ఒకరైన మాజీ నేవీ చీఫ్‌ జనరల్ సునిల్ లాంబా అన్నారు. “ఈ నోట్‌లోని అన్ని అంశాలను అందరూ అంగీకరించారు. చీఫ్‌ ఆఫ్ డిఫెన్స్‌ స్టాఫ్‌కు బాధ్యతలు అప్పజెప్పారు’’ అని జనరల్‌ లాంబా పేర్కొన్నారు.

    జనరల్ బిపిన్ రావత్

    మరి ఇప్పటి వరకు ఏం మారింది?

    సైనిక దళాలతో, నాయకత్వంతో సంబంధం ఉన్న వ్యక్తులతో దీని గురించి మాట్లాడినప్పుడు, అది సాధించిన విజయాల గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని వ్యాఖ్యానించారు.

    అయితే, రిటైర్ట్‌ లెఫ్టినెంట్ జనరల్ సతీశ్‌ దువాలాంటి వారి దగ్గర కొంత సమాచారం ఉంది. వీరు చీఫ్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా రిటైరయ్యారు. "ఆరేడు నెలల్లో ఏం సాధించామో చెప్పడం కష్టం’’ అని దువా అన్నారు. ఇప్పుడిప్పుడే పనులు మొదలయ్యాయి. అవి పూర్తిస్థాయిలో జరగాలంటే కొంత సమయం పడుతుంది. నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. లక్ష్యం కూడా నిర్దేశించారు. ఆ లోగా అన్నీ సవ్యంగా జరుగుతాయని అనుకుంటున్నాను’’ అని దువా వ్యాఖ్యానించారు.

    సీడీఎస్‌ నుంచి ప్రభుత్వం ఏం ఆశిస్తోంది ?

    ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు, నియమాలను గమనిస్తే అందులో చాలా అంశాలున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఎవరికి వారు విడివిడిగా కాకుండా, సంయుక్తంగా వస్తువులను కొనడం, సిబ్బంది శిక్షణ ఇవ్వడం, వనరులను విస్తృతంగా వినియోగించుకోవడం, భారతదేశంలో తయారైన వస్తువులనే ఎక్కువగా వాడేలా చూడడం ఇందులో కీలకమైన అంశాలు.

    “సీడీఎస్‌ ముందు చాలా బాధ్యతలున్నాయి. థియేటర్‌ కమాండ్‌, యాక్టివ్‌ కమాండ్‌ గురించి ఇంకా చర్చించాల్సిన అవసరం ఉంది. అవి ఎలా ఉండాలన్నది కూడా చీఫ్ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్ నిర్ణయిస్తారు’’ అని రిటైర్డ్ రియర్‌ అడ్మిరల్ సుదర్శన్‌ శ్రీఖండే బీబీసీతో అన్నారు.

    “ కోవిడ్‌-19 సంక్షోభం, చైనాతో ఘర్షణలు మనం జాయింట్‌నెస్‌ నుంచి మరింత ముఖ్యమైన సమస్యలవైపు మన దృష్టిని మరల్చాయి” అని చీఫ్ ఆఫ్‌ ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా పదవీ విరమణ చేసిన జనరల్‌ అనిల్ చైత్‌ అన్నారు. “ పదవిని సృష్టించిన ఎనిమిది నెలలు అవుతోంది. ఈలోగా ఒక విజన్‌ డాక్యుమెంట్ రావాల్సి ఉంది. త్వరలోనే వస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ ఇంకా సంకేతాలు నాకు కనిపించలేదు ’’ అని చైత్ అన్నారు.


    ప్రధాని మోదీతో బిపిన్ రావత్

    ఇంకా మారనిది ఏంటి?

    ప్రతి సంవత్సరం భారతదేశపు రక్షణ బడ్జెట్‌ పెరుగుతోంది. ఇందులో అరవైశాతం జీతాలు, పెన్షన్‌ కోసం ఖర్చు చేస్తారు. ఆయుధాలు, వస్తువుల కోసం పెట్టుబడులు పెట్టడానికి, పాత వాటిని భర్తీ చేయడానికి బడ్జెట్‌ తగ్గిస్తున్నారు.

    "సైన్యం ఆధునికీకరణ, మానవ వనరులకు సంబంధించిన వ్యయాలలో ఆదా చేయడానికి అవసరమైన ప్రయత్నాలను మేం ఇంకా చూడలేదు" అని మనోహర్ పారికర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్‌ స్టడీస్‌ అండ్‌ ఎనాలిసిస్‌లో పరిశోధకుడు డాక్టర్ లక్ష్మణ కుమార్ బెహరా అన్నారు.

    “అయితే, చైనాతో సరిహద్దు ఘర్షణ మన దృష్టిని మళ్ళించిందని నేను నమ్ముతున్నాను. సైన్యం తన బడ్జెట్‌లో 60 శాతం జీతాలు పెన్షన్ల కోసం ఖర్చు చేయాలి. ఇది సైన్యం సమర్ధతను ప్రభావితం చేస్తుంది. దాన్ని మెరుగుపరచడానికి ఏ చర్యలు తీసుకున్నారో నాకు తెలియదు. వీటికి సరైన పరిష్కారం బడ్జెట్‌ను పెంచడమే. పెన్షన్‌ నిబంధనలు, సర్వీసు నిబంధనలను దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పరిశీలించాలి’’ అని బెహరా వ్యాఖ్యానించారు.

    ఏది సరైన మార్గం ?

    జూన్‌ 30, 2020లోగా ఎయిర్‌ డిఫెన్స్‌ కమాండ్‌ను ఏర్పాటు ప్రతిపాదనను సిద్ధం చేయాలని తాను పదవిని చేపట్టిన మూడవరోజునే ప్రకటించారు సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌.

    సీడీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఫిబ్రవరి 17, 2020న బిపిన్‌ రావత్‌ ఒక చేసిన ఒక ప్రకటనను ‘ది హిందూ’ పత్రిక ప్రచురించింది. “భారత ద్వీపకల్ప రక్షణ మొత్తాన్ని ఒకే కమాండర్‌ పరిధిలోకి తీసుకురావాలని అనుకుంటున్నాం. అలాగే తూర్పు, పశ్చిమ నౌకాదళాలను ఏకం చేసి ద్వీకకల్ప నౌకాదళం (పెనిన్సులార్‌ కమాండ్‌)గా మార్చగలమా ? అన్ని పరిశీలిస్తున్నాం. మార్చి 31నాటికి పెనిన్సులార్‌ కమాండ్ ఏర్పాటుపై పరిశీలన ప్రారంభిస్తాం. అంతర్జాతీయ సరిహద్దు ఉన్న జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక థియేటర్‌ కమాండ్‌ ఉంటుంది. పశ్చిమ థియేటర్‌ కమాండ్‌ను కూడా ప్రత్యేక కమాండ్‌గా తీర్చి దిద్దుతాం’’ అని రావత్‌ పేర్కొన్నారు.

    “ఒకటి లేదా రెండు థియేటర్‌ కమాండ్‌లు చైనా సరిహద్దును పర్యవేక్షిస్తాయి’’ అని ఆయన చెప్పారు. ఈ ప్రకటన నౌకాదళంలో సంచలనం కలిగించింది.

    "వారు ఎంచుకున్న పేరు భారత నౌకాదళం హిందూ మహాసముద్రానికే పరిమితం కాకుండా పసిఫిక్ మహాసముద్రంలో మన ప్రయోజనాలకు కూడా న్యాయం చేసేలా ఉండాలి" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి చెప్పారు.


    జనరల్ బిపిన్ రావత్

    కొందరు దీన్ని తొందరగా తీసుకున్న నిర్ణయంగా తప్పుబట్టారు. “ఇవి ఒకరి మనసులో పుట్టిన నిర్ణయాలా లేక పరిశోధించి చేసిన ప్రకటనలా ? మనం దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి మాట్లాడుకోవాలి. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ముఖ్యం’’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

    “వృత్తిపరమైన మార్పుల కోసం సంస్థాగతంగా నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం. వ్యక్తిగత నిర్ణయాలు సరికాదు’’ అని జనరల్‌ చైత్‌ వ్యాఖ్యానించారు. “పారదర్శకతతో నిర్ణయాలు తీసుకోవాలి. ఇవి దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా ఉండాలి’’ అని చైత్‌ అన్నారు.

    “చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌ స్టాఫ్‌ ముందున్న అతి పెద్ద సవాల్‌ ఏంటంటే, ఆయన మేనేజర్‌గా కాక, నాయకుడిగా మారాలి. ఎందుకంటే, ఈ పదవిలో విరుద్ధ ప్రయోజనాల అంశం ఎప్పుడూ ఉంటుంది’’ అని చైత్‌ అన్నారు.

    ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి ?

    ఒక విభాగం ముందుకు పోతూ, ఒక విభాగం వెనకే నిలిచిపోయే ఏకపక్ష ఆధునికీకరణను నివారించాలని బిపిన్ రావత్‌ తరచూ తన ప్రసంగాలలో నొక్కి చెబుతుంటారు.

    పెరుగుతున్న పెన్షన్ ఖర్చులు, సినర్జీ, ఇంటిగ్రేషన్, జాయింట్‌నెస్‌ గురించి ఆయన మాట్లాడుతుంటారు. అయితే ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే సీడీఎస్‌ పదవి ఏర్పడేనాటికి 'ఆపరేషన్, లాజిస్టిక్, ట్రైనింగ్, సపోర్ట్ సర్వీసెస్, కమ్యూనికేషన్, రిపేర్, మెయింటెనెన్స్‌లను మూడేళ్లలో జాయింట్‌నెస్‌లోకి తీసుకురావడం అన్నది కేంద్ర క్యాబినెట్ ప్రధాన లక్ష్యం.


    జనరల్ బిపిన్ రావత్

    ఉమ్మడి (జాయింట్‌నెస్‌) అంటే కలిసి నడవడం.

    “ఎయిర్‌ డిఫెన్స్‌, పెనిన్సులార్‌ కమాండ్‌ గురించే మీడియా ఎక్కువగా మాట్లాడుతుంది. కానీ, వీటికన్నా పెద్ద విషయాలు, సమస్యలు చాలా ఉన్నాయి. వాటి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు’’ అని జనరల్ దువా అన్నారు.

    "సైబర్, స్పేస్, సోషల్ మీడియావంటి అంశాలు కూడా ముఖ్యమైనవే. ఇక్కడ పరిస్థితులు మారుతున్నాయి’’ అని ఆయన అన్నారు.

    ప్రజలకు ఎంత వరకు సమాచారం ఇవ్వాలన్నది కూడా చాలా ముఖ్యమైనదే.“ మేం ఆఫీసులో చాలా ముఖ్యమైన పనులు చేస్తున్నాం. చేస్తున్న వాటన్నింటినీ బయటికి చెప్పాల్సిన పనిలేదు. మీకు ఎంత తెలుసు అన్నదే ఇక్కడ ముఖ్యం’’ అని సీడీఎస్‌ కార్యాలయంతో సంబంధం ఉన్న ఒక ఉద్యోగి చెప్పారు.

    సీడీఎస్‌ నియామకం ఒక పెద్ద విషయమే. కానీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మిలిటరీ ఎఫైర్స్‌ విభాగం(డీఎంఏ) ఏర్పాటు కూడా అంతకంటే పెద్ద విషయమని నిపుణులు చెబుతున్నారు.

    “ఇందులో ఏర్పాటు చేసిన నిబంధనలు ఎవరూ ఊహించనవి. ఇప్పటి వరకు ప్రజల అభిప్రాయం ఏంటంటే, సేవలకు సంబంధించిన ప్రతిపాదనలను సైన్యం చేస్తుంది, అధికార యంత్రాంగం వీటిని ఆమోదించడం, తిరస్కరించడంలాంటివి చేస్తుంది. లేదంటే రాజకీయ నిర్ణయాలకు పంపుతుంది అని. కానీ ఇప్పుడు డిపార్ట్‌మెంట్ ఆఫ్ మిలిటరీ ఎఫైర్స్‌ వచ్చాక, ప్రతి ప్రతిపాదనను ఈ విభాగం పరిశీలిస్తుంది. ప్రతి నిర్ణయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంది’’ అని రిటైర్డ్‌ రియర్‌ అడ్మిరల్‌ శ్రీఖండే అన్నారు.

    ఇప్పుడు డీఎంఏలో 160మంది సివిల్ సర్వెంట్లు, వందలమంది సైనిక సిబ్బంది ఉన్నారు. ఒక సివిల్ సర్వెంట్ జాయింట్‌ సెక్రటరీగా ఉండగా, బిపిన్‌ రావత్ ఈ విభాగానికి అధినేతగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 15న ఈ పదవిని ఏర్పాటు చేసి ప్రధానమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ పదవిని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రధాని మోదీ తన ప్రసంగంలో 39 సెకండ్లలో ప్రకటించడమే కాక, దానిపై తన విజన్‌ ఏంటో కూడా వెల్లడించారు.

    ఆ సమయంలో అక్కడే ఉన్న ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్ ఈ ప్రకటనపై చిరు మందహాసం చేయగా, నేవీ చీఫ్ అంగీకారంగా తల ఊపారు. అప్పటి ఆర్మీ చీఫ్‌ జనరల్ బిపిన్‌ రావత్‌ మాత్రం గంభీరంగా కూర్చుని కనిపించారు.

    Comments

    Popular posts from this blog

    India power plant fire: Nine reported dead in major blaze in Telangana

    కరోనావైరస్: 700 కోట్ల జనాభాకు వ్యాక్సిన్ వేయటం ఎలా?

    Gandhi's glasses left in letterbox sell for £260k