నేతాజీ సుభాష్ చంద్రబోస్: 1934 - ఎ లవ్ స్టోరీ!

 

సుభాష్ చంద్రబోస్

అది 1934. శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొంటూ జైలు పాలైన సుభాష్ చంద్రబోస్ ఆరోగ్యం క్రమంగా దిగజారడంతో బ్రిటిష్ ప్రభుత్వం చికిత్స నిమిత్తం ఆయనను యూరప్‌లోని ఆస్ట్రియాకు పంపింది.

అయితే వియన్నాలో చికిత్స పొందుతూనే యూరప్‌లో ఉన్న భారతీయ విద్యార్థులను ఏకం చేసి, వారు స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనేలా చేయాలని బోస్ భావించారు.

ఆ సమయంలో ఒక యూరోపియన్ పబ్లిషర్ 'ద ఇండియన్ స్ట్రగుల్' అన్న పుస్తకం రాయాలని ఆయనను కోరారు. దాంతో బోస్‌కు ఇంగ్లీష్ తెలిసిన, టైపింగ్ వచ్చిన ఒక అసిస్టెంట్ అవసరం ఏర్పడింది.

బోస్ స్నేహితుడైన డాక్టర్ మాథూర్ ఆయనకు రెండు పేర్లను సూచించారు. వారిలో ఒకరు 23 ఏళ్ల ఎమిలీ షెంకెల్. బోస్ ఆ ఆస్ట్రియా యువతిని తన సహాయకురాలిగా నియమించుకున్నారు. ఎమిలీ 1934 జూన్ నుంచి బోస్‌తో కలిసి పని చేయడం ప్రారంభించారు.

ఆ సమయంలో బోస్‌కు 34 ఏళ్లు. ఎమిలీని కలవడానికి ముందు ఆయన ఆలోచనలన్నీ దేశ స్వాతంత్ర్యం మీదే నిమగ్నమై ఉన్నాయి. అయితే ఎమిలీ తన జీవితంలో ఒక తుపాను తెస్తుందని ఆయన ఊహించలేకపోయారు.


సుభాష్ చంద్రబోస్
ఫొటో క్యాప్షన్,

ఏసీఎన్ నంబియార్, హేడీ మిల్లర్, సుభాష్ చంద్రబోస్, ఎమిలీ షెంకెల్

సుభాష్ చంద్రబోస్ సోదరుడు శరత్ చంద్రబోస్ మనవడైన సుగత్ బోస్, సుభాష్ చంద్రబోస్‌పై ఒక పుస్తకం రాశారు. అందులో ఆయన ఎమిలీని కలవడంతో బోస్ జీవితమే మారిపోయిందని రాశారు.

'మొదట ప్రేమ విషయాన్ని బోసే ప్రతిపాదించారు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించడం ప్రారంభించింది. 1934-36 మధ్యకాలంలో ఆస్ట్రియా, చెకొస్లొవేకియాలలో ఉన్న సమయం మా జీవితంలో అత్యంత మధురమైనది' అని ఎమిలీ సుగత్ బోస్‌కు చెప్పుకొచ్చారు.

ఎమిలీ జనవరి 26, 1910లో ఆస్ట్రియాలోని క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రికి ఆమె ఓ భారతీయుని వద్ద పని చేయడం ఇష్టం లేదు. అయితే సుభాష్ చంద్రబోస్‌ను కలిసిన తర్వాత ఆయన వారి ప్రేమను కాదనలేకపోయారు.

ప్రముఖ విద్యావేత్త రుద్రాంశు ముఖర్జీ- బోస్, జవహర్ లాల్ నెహ్రూ జీవితాలను పోలుస్తూ ' నెహ్రూ అండ్ బోస్, పేరలల్ లైవ్స్' అనే పుస్తకాన్ని రాశారు. అందులో ఆయన బోస్, నెహ్రూలపై వారి భార్యల ప్రభావాం గురించి రాసుకొచ్చారు.

ఆ పుస్తకంలో ముఖర్జీ, ''సుభాష్, ఎమిలీలు మొదటి నుంచీ తమ బంధం ప్రత్యేకమైనదని, క్లిష్టమైనదని గుర్తించారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలను బట్టి ఈ విషయం మనకు తెలుస్తుంది. ఎమిలీ మిస్టర్ బోస్ అని సంబోధిస్తే, బోస్ ఆమెను మిస్ షెంకెల్ లేదా పెర్ల్ షెంకెల్ అని సంబోధించేవారు.'' అని రాశారు.


బోస్ ఎమిలీకి రాసిన ప్రేమలేఖ
ఫొటో క్యాప్షన్,

బోస్ ఎమిలీకి రాసిన ప్రేమలేఖ

తన ఉనికి బయటపడకుండా ఉండడానికి, సైనిక పోరాటంలో యూరోపియన్ దేశాల సహాయాన్ని తీసుకోవడానికి బోస్ నిరంతరం ఒకచోటి నుంచి మరో చోటికి వెళ్లాల్సి వచ్చేది. అయితే ఎమిలీ పట్ల ఆయనకు ఎంత ప్రేమ ఉండేదో ఆయన ఆమెకు రాసిన ప్రేమలేఖను బట్టి తెలుస్తుంది.

1936 మార్చి 5న రాసిన ఈ లేఖలో, ''మై డార్లింగ్, సమయం వస్తే మంచు కూడా కరుగుతుంది. ప్రస్తుతం నా హృదయం పరిస్థితి కూడా ఇదే. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో రాయకుండా, చెప్పకుండా నన్ను నేను నిలువరించుకోలేకపోతున్నాను. మై డార్లింగ్, నువ్వు నా హృదయ సామ్రాజ్ఞివి. కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?'' అని అంటారు.

''భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలీదు. బహుశా నేను జీవితాంతం జైలులో గడపాల్సి రావచ్చు. నన్ను కాల్చి చంపొచ్చు, ఉరి తీయొచ్చు. నేను మళ్లీ నిన్ను చూడలేకపోవచ్చు. బహుశా నేను ఉత్తరాలు కూడా రాయలేకపోవచ్చు. కానీ నన్ను నమ్ము, నువ్వెప్పుడూ నా హృదయంలోనే ఉంటావు. మనం ఈ జీవితంలో కలిసి ఉండలేకపోతే, వచ్చే జన్మలోనైనా కలిసి ఉందాం.'' అని ఎమిలీకి రాశారు.

సుభాష్ చంద్రబోస్ భార్య ఎమిలీ, కూతురు అనిత
ఫొటో క్యాప్షన్,

సుభాష్ చంద్రబోస్ భార్య ఎమిలీ, కూతురు అనిత

మనసు చెదిరిన బోస్

బోస్ స్నేహితులు, రాజకీయ సహచరులు ఏసీఎన్ నంబియార్, ''బోస్ ఆలోచనలు ఎప్పుడూ దేశ స్వాతంత్ర్యం మీదే కేంద్రీకృతమై ఉండేవి. ఆయన మనస్సు ఎక్కడైనా చెదిరింది అంటే అది ఎమిలీతో ప్రేమలో పడినప్పుడే'' అని సుగత్ బోస్‌కు తెలిపారు.

ఆ సమయంలో బోస్ మానసిక స్థితి ఎలా ఉందో 1937 ఏప్రిల్ లేదా మేలో ఎమిలీకి రాసిన లేఖ ద్వారా తెలుస్తుంది.

''గత కొన్ని రోజుల నుంచి నీకు ఉత్తరం రాయాలనుకుంటున్నా. కానీ నీకు తెలుసు, నీ గురించి నా భావాలను మాటల్లో పెట్టడం ఎంత కష్టమో. నేను నీ పట్ల గతంలో ఎలా ఉన్నానో, ఇప్పుడూ అలాగే ఉన్నానని మాత్రమే చెప్పదల్చుకున్నా.''

''నీ గురించి తలచుకోకుండా ఒక్క దినం కూడా గడవదు. నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు. నువ్వు కాకుండా నేను ఇతరుల గురించి ఆలోచించను కూడా ఆలోచించలేను. ఈ రోజుల్లో నేనెంత ఒంటరిగా, దిగులుగా ఉన్నానో నీకు చెప్పలేను. కేవలం ఒకే ఒక్క విషయం నన్ను సంతోషంగా ఉంచుతోంది. అయితే అది సాధ్యమో లేదో నాకు తెలీదు. రాత్రీ పగలూ నేను దాని గురించే ఆలోచిస్తున్నాను. నాకు సరైన దారి చూపించాలని ప్రార్థిస్తున్నాను.'' అని రాశారు.

గాంధీ, సుభాష్ చంద్రబోస్

శరత్ చంద్రబోస్ కుమారుడు శిశిర్ కుమార్ బోస్ భార్య కృష్ణ బోస్ 'ఎ ట్రూ లవ్ స్టోరీ - ఎమిలీ అండ్ సుభాష్' పుస్తకాన్ని రాశారు. అందులో ఆమె సుభాష్ చంద్రబోస్, ఎమిలీల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

ఎమిలీ, బోస్‌ల వివాహం డిసెంబర్ 27, 1937న ఆస్ట్రియాలోని బాడ్‌గస్టైన్‌లో జరిగింది.

అయితే తమ వివాహాన్ని రహస్యంగా ఉంచాలని వారు నిర్ణయించుకున్నారు. తమ పెళ్లి రోజు గురించి తప్ప ఏ వివరాలూ ఎమిలీ వెల్లడించలేదని కృష్ణ బోస్ తెలిపారు.

అయితే వారి కూతురు అనితా బోస్ మాత్రం తన తల్లి ఎమిలీ ఇతర భారతీయ పెళ్లికూతురి తరహాలోనే తలపై సింధూరం ధరించారని వివరించారు.

సుభాష్ చంద్రబోస్, ఎమిలీ షెంకెల్
ఫొటో క్యాప్షన్,

ఎమిలీ షెంకెల్, సుభాష్ చంద్రబోస్

మేధోపరమైన అంతరాలు

వారిద్దరి మధ్యా ఎంతో ప్రేమ ఉన్నా మేధోపరంగా వారిద్దరి మధ్యా ఎంతో అంతరం ఉండేది. కొన్నిసార్లు అది బయటపడేది.

కృష్ణ బోస్ తన పుస్తకంలో, 'ఎమిలీ భారతదేశంలోని పత్రికల కోసం వియన్నా నుంచి ఏదైనా రిపోర్టులు రాయాలని బోస్ సూచించారు. బోస్ సూచన మేరకు ఎమిలీ ద హిందూ, మాడర్న్ రివ్యూలకు కొన్ని వ్యాసాలు రాశారు. అయితే వార్తలను విశ్లేషించడంలో ఆమె అంత దిట్ట కారు. దీంతో బోస్ అనేకమార్లు వాటిని విమర్శించేవారు.' అని తెలిపారు.

1937, ఆగస్టు 12న ఎమిలీకి రాసిన లేఖలో బోస్, 'నువ్వు భారత్ గురించి ఏవైనా కొన్ని పుస్తకాలు పంపమని రాశావు. కానీ వాటిని నీకు పంపినా లాభం లేదని అనిపిస్తోంది. ఎందుకంటే నీ వద్ద ఉన్న పుస్తకాలనే ఇప్పటి వరకు నువ్వు చదవలేదు' అని రాశారు.

'నువ్వు సీరియస్‌గా లేనంత వరకు పుస్తకాలు చదవడంలో నీకు ఆసక్తి పెరగదు. వియన్నాలో నువ్వు చాలా పుస్తకాలే సేకరించావు. కానీ వాటిన్నటినీ చదవలేదని నాకు తెలుసు' అని బోస్ అనే వారు.

ఇవన్నీ ఎలా ఉన్నా, వాళ్లిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకునేవారు. వాళ్ల ప్రేమకు గుర్తుగా నవంబర్ 29, 1942న బోస్, ఎమిలీలకు కూతురు పుట్టింది. వారు ఆమెకు ఇటలీ విప్లవ నేత గారిబాల్డీ భార్య, బ్రెజిల్ మూలాలు కలిగిన అనిత గారిబాల్డీ పేరిట అనిత అని పెట్టారు.

ఇందిర, నెహ్రూలతో బోస్

చివరి వరకు రహస్యంగానే..

వివాహాన్ని రహస్యంగా ఉంచడం వెనుక అది తన పొలిటికల్ కెరీర్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉందని బోస్ భావించి ఉండవచ్చు. అంతే కాకుండా ఒక విదేశీ వనితను పెళ్లాడారన్న ఇమేజ్ ఆయనపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

శరత్ చంద్రబోస్ కార్యదర్శి, ప్రముఖ రచయిత నిరాద్ సి.చౌదరి 1989లో రాసిన 'దై హ్యాండ్, గ్రేట్ అనార్క్: ఇండియా 1921-1952' అన్న పుస్తకంలో ‘'బోస్ వివాహం గురించి తెలిసినపుడు నాకు షాక్ తగిలింది. మొదటి యుద్ధం తర్వాత ఆయన తన సెక్రటరీ అయిన ఒక జర్మన్ మహిళను పెళ్లాడినట్లు నాకు తెలిసింది'' అని పేర్కొన్నారు.

సుభాష్ చంద్రబోస్ 1942 డిసెంబర్‌లో తన కూతురిని చూసేందుకు వియన్నా వెళ్లారు. ఆ తర్వాత ఆయన సోదరుడు శరత్ చంద్రబోస్‌కు బెంగాలీలో రాసిన లేఖలో తన భార్య, కూతురి గురించి పేర్కొన్నారు. అక్కడి నుంచి ఒక మిషన్ మీద వెళ్లిన ఆయన తర్వాత మరెన్నడూ ఎమిలీ, అనితలను కలుసుకోలేదు.

కానీ ఎమిలీ సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకాలతోనే జీవించి 1996లో కన్ను మూశారు. ఓ చిన్న పోస్టాఫీసులో పని చేస్తూ ఆమె సుభాష్ చంద్రబోస్ గుర్తుగా మిగిలిన అనితా బోస్‌ను పెంచి పెద్ద చేసి, జర్మనీలో పెద్ద ఆర్థికవేత్తగా తీర్చిదిద్దారు.

ఎన్ని కష్టాలు ఎదురైనా ఆమె సుభాష్ చంద్రబోస్ కుటుంబం నుంచి సహాయాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. అంతే కాదు, తమ వైవాహిక జీవితం గురించి బోస్ ఎంత రహస్యంగా ఉంచారో, దానిని ఆమె చివరి వరకు కాపాడారు.

Comments

Popular posts from this blog

India power plant fire: Nine reported dead in major blaze in Telangana

కరోనావైరస్: 700 కోట్ల జనాభాకు వ్యాక్సిన్ వేయటం ఎలా?

Gandhi's glasses left in letterbox sell for £260k