అసలు నిజం ఏంటి?

 

పాకిస్తాన్‌కు భారత్ కంటే ఒక రోజు ముందే స్వాతంత్ర్యం వచ్చిందా? అసలు నిజం ఏంటి?

భారత్ కన్నా ఒక రోజు ముందే తమకు స్వాతంత్ర్యం వచ్చిందని పాకిస్తానీలు వాదిస్తుంటారు
ఫొటో క్యాప్షన్,

భారత్ కన్నా ఒక రోజు ముందే తమకు స్వాతంత్ర్యం వచ్చిందని పాకిస్తానీలు వాదిస్తుంటారు

బ్రిటిష్ పాలన నుంచి భారత్, పాకిస్తాన్‌లకు స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లకుపైనే గడిచాయి.

భారత్‌లో‌ ఏటా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుగుతాయి. పాకిస్తాన్‌లో మాత్రం ఒక రోజు ముందుగా, ఆగస్టు 14న ఈ సంబరాలు చేసుకుంటారు.

భారత్, పాకిస్తాన్‌లు ఒకేసారి స్వతంత్ర దేశాలుగా మారాయి. మరి, స్వాతంత్ర్య దినోత్సవ తేదీల్లో ఈ తేడా ఎందుకు వచ్చింది?

ముస్లింలు పవిత్రంగా భావించే జుమ్మా అల్-వదా రోజున పాకిస్తాన్‌కు స్వాతంత్ర్యం వచ్చిందని, అది 1947, ఆగస్టు 14న అని పాకిస్తాన్‌లో ప్రచారంలో ఉంది.

భారత్ కన్నా ఒక రోజు ముందే తమకు స్వాతంత్ర్యం వచ్చిందని పాకిస్తానీలు వాదిస్తుంటారు కూడా.

పాకిస్తాన్‌కు స్వాతంత్ర్యం వచ్చాక 11 నెలలకు, అంటే 1948 జులై 9న పాకిస్తాన్‌లో తొలిసారి పోస్టల్ స్టాంపులు జారీ చేశారు. ఆ స్టాంపులపై పాకిస్తాన్‌కు స్వాతంత్ర్యం వచ్చిన రోజు 1947, ఆగస్టు 15 అని స్పష్టంగా ముద్రించి ఉంది.

కానీ, ఆ తర్వాత ఏటా ఆగస్టు 14నే పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది.

ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్

భారత్, పాకిస్తాన్‌ల స్వాతంత్ర్యానికి సంబంధించి ముఖ్యమైన అధికార పత్రం ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్-1947.

బ్రిటీష్ పార్లమెంటు ఆమోదించిన ఈ బిల్లుపై అప్పటి బ్రిటీష్ రాజు జార్జ్- VI 1947 జులై 18న సంతకం చేశారు.

పాకిస్తాన్ సెక్రటరీ జనరల్ చౌధరి మహమ్మద్ అలీ (ఆ తర్వాత పాక్‌కు ప్రధాని కూడా అయ్యారు) దీని కాపీని పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నాకు జులై 24న పంపారు.

బ్రిటీష్ ప్రభుత్వం 1983లో ప్రచురించిన ‘అధికార బదిలీ’ అనే పత్రంలోని 12వ వాల్యూమ్‌లోని 234వ పేజీలో... 1947 ఆగస్టులో బ్రిటీష్ ఇండియాలో భారత్, పాకిస్తాన్ పేర్లతో రెండు స్వతంత్ర, సార్వభౌమ దేశాలు ఏర్పడతాయని... ఇవి ఏర్పడే తేదీ ఆగస్టు 15 అని ఉంది.

ఐరాసలోని బ్రిటీష్ శాశ్వత రాయబారికి బ్రిటన్ విదేశంగ శాఖ నుంచి 1947 ఆగస్టు 7న ఓ సందేశ పత్రం అందింది.

‘‘ఐరాస సభ్యత్వం కోసం ముస్లిం నాయకులు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారని వైశ్రాయ్‌ సందేశం పంపారు. ఆగస్టు 15న పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడగానే, ఆ దేశానికి ఐరాస సభ్యత్వం వచ్చేలా బ్రిటన్ తరఫున వెంటనే పిటిషన్‌ను వేయండి’’ అని అందులో ఉంది.

భారత్, పాకిస్తాన్ అధికారాల విషయమై ఐరాస సెక్రటేరియట్ మెమురాండం గురించి 1947 ఆగస్టు 12న జారీ చేసిన పత్రిక ప్రకటనలో... ‘‘1947, ఆగస్టు 15న భారత్, పాకిస్తాన్ పేర్లతో రెండు స్వతంత్ర దేశాలు ఏర్పడుతున్నట్లు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ పేర్కొంది’’ అని ఉంది.

భారత్ స్వాతంత్ర్యం గురించి ప్రకటన చేస్తున్న మౌంట్‌బాటెన్
ఫొటో క్యాప్షన్,

భారత్ స్వాతంత్ర్యం గురించి ప్రకటన చేస్తున్న మౌంట్‌బాటెన్

మౌంట్‌బాటెన్‌కు సమయం లేక...

1947, ఆగస్టు 15 రోజు మొదలవుతూనే (ఆగస్టు 14న రాత్రి 12 గంటలకు) భారత్, పాకిస్తాన్‌లకు ఒకేసారి స్వాతంత్ర్యం వస్తుందని బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించింది.

అయితే, అప్పటి భారత వైశ్రాయ్ లార్డ్ మౌంట్‌బాటెన్ ఆగస్టు 14, 15ల మధ్య రాత్రి స్వాతంత్ర్యం గురించి ప్రకటించేందుకు, స్వతంత్ర భారత్‌కు మొదటి గవర్నర్ జనరల్ పదవిని చేపట్టేందుకు దిల్లీలో ఉండాల్సి వచ్చింది.

అందుకే, ఆయన పాకిస్తాన్‌లోని కరాచీకి ఆగస్టు 13నే వెళ్లారు.

ఆ రోజు రాత్రి కరాచీలో మౌంట్‌బాటెన్ గౌరవార్థం ఓ విందు ఏర్పాటైంది. ఇందులో జిన్నా ప్రసంగించారు.

ఆగస్టు 15న బ్రిటీష్ ప్రభుత్వం నుంచి పూర్తి అధికారాలు భారత్‌కు బదిలీ అవుతున్నందుకు... భారత్, పాకిస్తాన్ రెండు స్వతంత్ర దేశాలుగా ఏర్పడుతున్నందుకు సంతోషంగా ఉందని జిన్నా అన్నారు.

పాకిస్తాన్ తొలి గవర్నర్ జనరల్‌గా జిన్నా నామినేట్ అయ్యారు.

ఆగస్టు 14 ఉదయం పాకిస్తాన్ రాజ్యాంగ సభలో మౌంట్‌బాటెన్ ప్రసగించారు. ఆగస్టు 14, 15 తేదీల మధ్య రాత్రి 12 గంటలకు పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరిస్తుందని ప్రకటించారు.

‘‘ఈ రోజు (ఆగస్టు 14న) మీ వైశ్రాయ్‌గా నేను ఇక్కడ ప్రసంగిస్తున్నా. రేపు (ఆగస్టు 15న) అధికార పగ్గాలు పాకిస్తాన్‌లోని కొత్త ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి. నేను మీ పొరుగు దేశమైన భారత్‌కు రాజ్యాంగాధినేతగా (గవర్నర్ జనరల్)గా ఉంటాను’’ అని మౌంట్‌బాటెన్ అన్నారు.

ఆగస్టు 14న మధ్యాహ్నం 12 గంటల సమయంలో మౌంట్‌బాటెన్ దిల్లీకి పయనమయ్యారు.

డాన్ పత్రిక ప్రచురించిన ప్రత్యేక సంచిక
ఫొటో క్యాప్షన్,

డాన్ పత్రిక ప్రచురించిన ప్రత్యేక సంచిక

ఆ రోజు అర్ధ రాత్రి 12 గంటలకు భారత్ స్వాతంత్ర్యం గురించి ప్రకటన చేసి, దేశ తొలి గవర్నర్ జనరల్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

అదే సమయంలో పాకిస్తాన్ జాతీయో రేడియో కూడా పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందినట్లు ప్రకటనను ప్రసారం చేసింది. లాహోర్, పెషావర్, ఢాకాల్లో ఈ ప్రసారాలు వచ్చాయి.

అంతకు గంట ముందు (ఆగస్టు 14, రాత్రి 11 గంటలకు) ఈ నగరాల్లో ఆల్ ఇండియా రేడియో తమ ఆఖరి ప్రసారాలు చేసింది.

ఆగస్టు 15న ఉదయం పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, అక్కడి పత్రికల్లో ప్రత్యేక సంచికలు వచ్చాయి. ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక ‘డాన్’ కరాచీలో తమ పబ్లికేషన్‌ను ప్రారంభించింది.

1947, ఆగస్టు 15న జిన్నా పాకిస్తాన్ గవర్నర్ జనరల్‌ పదవీ భాద్యతలు తీసుకున్నారంటూ అదే రోజు స్వతంత్ర పాకిస్తాన్‌లో తొలి గెజిట్ జారీ అయ్యింది.

జిన్నాతో లాహరో హైకోర్టు చీఫ్ జస్టిస్ అబ్దుల్ రషీద్ ప్రమాణ స్వీకారం చేయించారు. నవాబ్జాదా లియాఖత్ ఖాన్ నేతృత్వంలో తొలి కేబినెట్ కూడా ప్రమాణ స్వీకారం చేసింది. ఇవన్నీ ఆగస్టు 15నే జరిగాయి.

పై ఆధారాలన్నీ పాకిస్తాన్‌కు స్వాతంత్ర్యం వచ్చిన రోజు ఆగస్టు 15 అని, ఆగస్టు 14 కాదని స్పష్టం చేస్తున్నాయి.

    1947, ఆగస్టు 13న కరాచీలో మౌంట్‌బాటెన్ గౌరవార్థం ఓ విందు ఏర్పాటైంది
    ఫొటో క్యాప్షన్,

    1947, ఆగస్టు 13న కరాచీలో మౌంట్‌బాటెన్ గౌరవార్థం ఓ విందు ఏర్పాటైంది

    తొలి స్టాంపులపై ఆగస్టు పదిహేనే

    పాకిస్తాన్‌లో స్వాతంత్ర్యం ఏ రోజున వచ్చిందనే విషయమై, తొలి ఏడాది ఎవరికీ అయోమయం లేదు.

    1947, డిసెంబర్ 19న రాబోయే ఏడాది (1948)లో వార్షిక సెలవులను తెలియజేస్తూ పాకిస్తాన్ హోంశాఖ ఓ లేఖను విడుదల చేసింది.

    ఇందులో ఆగస్టు 15న పాకిస్తాన్ దినోత్సవంగా, సెలవు దినంగా పేర్కొన్నారు.

    ఇస్లామాబాద్‌లోని నేషనల్ డాక్యుమెంటేషన్ సెంటర్‌లో ఈ లేఖ ఇప్పటికీ భద్రంగా ఉంది.

    పాకిస్తాన్ స్టాంపు

    1948 తొలి త్రైమాసికంలో పాకిస్తాన్ పోస్టల్ విభాగం స్టాంపులు రూపొందించడం ప్రారంభించింది.

    ముద్రణ కోసం వీటిని బ్రిటన్‌కు పంపారు.

    ఈ స్టాంపులపై పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం ‘1947, ఆగస్టు 15’ అనే ఉంది.

    1948లో జులై 9న పాకిస్తాన్‌లో ఈ స్టాంపుల అమ్మకాలు మొదలయ్యాయి.

    అంటే, 1948లో ఈ స్టాంపులను ముద్రణ కోసం పంపేవరకూ ఆగస్టు 15నే స్వాతంత్ర్య దినోత్సవంగా గుర్తించారన్నది సుస్పష్టం.


    పాకిస్తాన్ హోం శాఖ లేఖ

    ఆగస్టు 14గా ఎలా మారింది?

    ఇస్లామాబాద్‌లోని నేషనల్ డాక్యుమెంటేషన్ సెంటర్‌లో ఈ వ్యవహారానికి సంబంధించిన సమచారం ఉన్న పత్రాలు ఉన్నాయి.

    వాటి ప్రకారం... 1948, జూన్ 29న పాకిస్తాన్ ప్రధాని నవాబ్‌జాద్ లిఖాయత్ అలీ ఖాన్ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. 1948లో ఆగస్టు 15న కాకుండా, ఆగస్టు 14నే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

    అయితే ఇదే తుది నిర్ణయం కాదని, గవర్నర్ జనరల్ జిన్నా ఆమోదం తర్వాత దీనిపై నిర్ణయం జరుగుతుందని లియాఖత్ అలీ మంత్రివర్గానికి తెలియజేశారు.

    ‘‘ఆగస్టు 15న కాకుండా, 14న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవాలన్న సూచనను గవర్నర్ జనరల్‌కు తెలియజేసే బాధ్యతను ప్రధాని తీసుకున్నారు’’ అని ఓ అధికార దస్త్రం పేర్కొంది.

    అయితే, ఎందుకు ఈ సూచన చేశారన్న వివరాలు మాత్రం అందులో లేవు. ఆ దస్త్రం చివర్లో మాత్రం బ్రాకెట్లలో గవర్నర్ జనరల్ జిన్నా ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లుగా ఉంది.

    ఆ తర్వాత అన్ని ప్రభుత్వ విభాగాలకు, శాఖలకు ఈ విషయమై ఆదేశాలు జారీ అయినట్లుగా ఉంది.

    పాకిస్తాన్ హోం శాఖ లేఖ

    అనంతరం ఈ విషయానికి సంబంధించి కేబినెట్ డిప్యుటీ సెక్రటరీని ఉద్దేశిస్తూ హోం శాఖ డిప్యుటీ సెక్రటరీ ఓ లేఖ రాశారు.

    ‘‘ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించాలన్న నిర్ణయం ఈ ఏడాది (1948)కి మాత్రమే వర్తిస్తుందా అని మీరు సందేహం వ్యక్తం చేశారు. కానీ, ఈ ఏడాది మాత్రమే కాదు, భవిష్యతులో ప్రతి ఏడాదీ ఆగస్టు 14నే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతాయి’’ అని అందులో పేర్కొన్నారు.

    దీని తర్వాత పాకిస్తాన్ వ్యాప్తంగా 1948లో ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. అయితే, డాన్ పత్రిక ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక సంచికను ప్రచురించింది. ఆ రోజు ఆదివారం కాబట్టి, డాన్ పత్రిక అలా చేసి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి.

    ఇక ఆ తర్వాత నుంచి ఆగస్టు 14నే పాకిస్తాన్‌లో స్వాతంత్ర్య వేడుకలు జరుగుతూ వస్తున్నాయి.

    పాకిస్తాన్ హోం శాఖ లేఖ

    దీంతో భారత్ కన్నా పాకిస్తాన్ ఒక రోజు ముందే స్వాతంత్ర్యం వచ్చిందన్న భావన పాకిస్తాన్ ప్రజల్లో ఏర్పడింది.

    నిజానికి పాకిస్తాన్ కేబినెట్ తమ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తేదీ (1947, ఆగస్టు 15)ని మార్చుకోలేదు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకునే తేదీని మాత్రం ఆగస్టు 14గా నిర్ణయించుకుంది. జిన్నా కూడా దీనికి ఆమెదం తెలిపారు

    Comments

    Popular posts from this blog

    India power plant fire: Nine reported dead in major blaze in Telangana

    కరోనావైరస్: 700 కోట్ల జనాభాకు వ్యాక్సిన్ వేయటం ఎలా?

    Gandhi's glasses left in letterbox sell for £260k